వినాయక పూజకు సన్నాహాలు
వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకుని స్నానం చేయాలి. దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి, దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో వుంచాలి.
వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఏదుట పేఏటాపాయ కొంచ్చ బియ్యాన్ని పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు, పూలు వేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆ పై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి.
ఆ తర్వాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ వుంచుకుని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు అవుతాయి. కాబట్టి తెల్లని వస్త్రాన్ని వుంచుకుంటే బాగుంటుంది.
పూజకు కావలసిన సామగ్రి
పసుపు, కుంకుమ, గంధం, అగరువత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూల దండలు, అరటి పండ్లు, కొబ్బరి కాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి లేక నూనె, దీపారాధన వత్తులు, వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు.
వినాయక వ్రతకల్పః
ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా- ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా- ఓం గోవిందాయ నమః -
విష్ణవే నమః - మధుసూదనాయ నమః - త్రివిక్రమాయ నమః - వామనాయ నమః - శ్రీధరాయ నమః - హృషీకేశాయ
నమః - పద్మనాభాయ నమః - దామోదరాయ నమః - సంకర్షణాయ నమః - వాసుదేవాయ నమః - ప్రద్యుమ్నాయ
నమః - అనిరుద్ధాయ నమః - పురుషోత్తమాయ నమః - అధోక్షజాయ నమః - నారసింహాయ నమః - అచ్యుతాయ
నమః - జనార్దనాయ నమః -ఉపేంద్రాయ నమః - హరయే నమః - శ్రీకృష్ణాయ నమః.
వినాయక ప్రార్థన
శ్లో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయే త్సరవిఘ్నోపశాంతయే ||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః,
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః.
ధూమకేతు ర్గణాధ్యక్షః, ఫాలచంద్రో గజాననః,
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరమ్బః స్కన్ద పూరజః.
షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయా దపి,
విద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా,
సఙ్గ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే.
అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి, సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమ: ||
సంకల్పం
ఓం. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తే అద్యబ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే, కలియుగే ప్రథమపాదే, జంబుద్వీపే, భరతవర్షే, భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే (ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ......(సంపత్సరం పేరు చెప్పాలి) నామ సంవత్సరే దక్షిణాయనే, వర్షఋతౌ, భాద్రపదమాసే, శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ... వాసరయుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవమగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్......... (పేరు) గోత్ర:........(గోత్రము పేరు). నామధేయహ: శ్రీమత: .... (పేరు) గోత్రస్య....(గోత్రము పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్థ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, ఇష్టఆమ్యార్థ సిద్ద్యర్థం, మనోవాంఛాఫల సిద్ద్యర్థం, సమస్తదురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడసోపచార పూజాం కరిష్యే(నీళ్ళూ తాకవలెను)
అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాంకరిష్యే! తదంగ కలశపూజాం కరిష్యే
కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య తస్యోపరి హస్తం నిధాయ-
కలశపూజ
కలశం గంధపుష్పాక్షతై రభ్యర్చ్య (కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షతలద్ది లోపల నొక పుష్పము నుంచి తదుపరి ఆ పాత్రను కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రములను చదువవలెను.)
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః ||
కుక్షౌతు సాగరాః సరే సప్తదీపా వసుంధరా |
ఋగేదో వి థ యజురేదః సామవేదో హ్యథరణః |
అంగైశ్చ సహితాః సరే కలశాంబు సమాశ్రితాః ||
ఆయాన్తు దేవ పూజార్థం దురితక్షయకారకాః |
గంగే చ యమునే చైవ గోదావరి సరసతి |
నర్మదే సింధుకావేరి జలేవి స్మిన్ సన్నిధిం కురు ||
కలశోదకేన పూజాద్రవ్యాణి దేవమండప మాత్మానం చ సంప్రోక్ష్య. (కలశమందలి జలమును చేతిలో పోసుకొని, పూజకొఱకైన వస్తువులమీదను దేవుని మండపమునందును తన నెత్తిమీదను చల్లుకొనవలసినది. ) తదంగతేన వరసిద్ధివినాయక ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. ఇప్పుడు పసుపుతో వినాయకుడి తయారుచేసుకోవాలి.
మహా (పసుపు) గణాధిపతి పూజ:-
గణాంత్వాం గణపతిగం హవామహే కవింకవీనా ముపమశ్రవస్తమం,
జ్యేష్టరాజం బ్రహ్మణ, బ్రహ్మణస్పత్య: ఆనశృణ్వన్నూతిభిస్సీద సాదనం
శ్రీ మహాగణాధిపతయే నమ: ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (పూలు, అక్షతలు కలిపాలి) యధాభాగం గుడంనివేదయామి
శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నో, సుప్రీతో, వరదోభవతు
శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణామి (రెండు అక్షతలు తలపై వేసుకోవాలి)
అథ శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే
ప్రాణ ప్రతిష్ట
మం || అసునీతే పునరస్మాసు చక్షుః
పునః ప్రాణ మిహనో ధేహి భోగమ్,
జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత
మనుమతే మృడయాన సస్తి.
అమృతం వై ప్రాణా అమృత మాపః ప్రాణానేవ యథాస్థాన ముపహయతే.
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్ |
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు ||
ఆవాహితో భవ, స్థాపితో భవ, సుప్రసన్నో భవ, వరదో భవ, అవకుంఠితో భవ, స్థిరాసనం కురు, ప్రసీద, ప్రసీద, ప్రసీద.
పూజా విధానమ్
శ్లో. భవసంచితపాపౌఘవిధ్వంసనవిచక్షణం |
విఘ్నాంధకారభాసంతం విఘ్నరాజ మహం భజే ||
ఏకదన్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాంకుశధరం దేవం ధాయే త్సిద్ధివినాయకమ్ ||
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం |
భక్తాభీష్టప్రదం తస్మా ద్ధ్యాయే త్తం విఘ్ననాయకమ్ ||
ధ్యాయే ద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం |
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్ ||
శ్రీ వరసిద్ధివినాయకం ధ్యాయామి.
శ్లో. అత్రా వి గచ్ఛ జగదంద్య సురరాజార్చితేశ్వర |
అనాథనాథ సరజ్ఞ గౌరీగర్భసముద్భవ ||
శ్రీ వరసిద్ధివినాయకం ఆవాహయామి.
శ్లో. మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నై ర్విరాజితం |
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
శ్రీ వరసిద్ధివినాయకాయ ఆసనం సమర్పయామి.
శ్లో. గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన !
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం |
శ్రీవరసిద్ధివినాయకాయ అర్ఘ్యం సమర్పయామి.
శ్లో. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక |
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ దిరదానన | శ్రీ వరసిద్ధివినాయకాయ పాద్యం సమర్పయామి
శ్లో. అనాథనాథ సరజ్ఞ గీర్వాణవరపూజిత |
గృహాణాచమనం దేవ! తుభ్యం దత్తం మయా ప్రభో శ్రీ వరసిద్ధివినాయకాయ ఆచమనీయం సమర్పయామి.
శ్లో. దధిక్షీరసమాయుక్తం మధాహ్హ్యేన సమన్వితం
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే
శ్రీ వరసిద్ధివినాయకాయ మధుపర్కం సమర్పయామి.
శ్లో. స్నానం పంచామృతై ర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ ! సర్వజ్ఞ గీర్వాణాగణపూజిత
శ్రీ వరసిద్ధివినాయకాయ పంచామృతస్నానం సమర్పయామి.
శ్లో. గంగాది సర్వతీర్థ్యేభ్య ఆహృతై రమలైర్జలైః
స్నానం కురుష భగవ న్నుమాపుత్త్ర నమోస్తుతే
శ్రీ వరసిద్ధివినాయకం శుద్ధోదక స్నానం కారయామి.
శ్లో. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం
శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ
శ్రీ వరసిద్ధివినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి.
శ్లో. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానా మిష్టదాయక
వరసిద్ధివినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి.
శ్లో. చందనాగురుకర్పూరకస్తూరీకుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
శ్రీ వరసిద్ధివినాయకం గంధాన్ ధారయామి.
శ్లో. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే
శ్రీ వరసిద్ధివినాయకాయ అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి.
శ్లో. సుగన్ధాని చ పుష్పాణి జాజీకుందముఖానిచ
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోస్తుతే
శ్రీ వరసిద్ధివినాయకం పుష్పైః పూజయామి.
అథాంగ పూజా
(ప్రతి నామమునకు కడపట ''పూజయామి అని చేర్చవలెను)
గణేశాయ నమః పాదౌపూజయామి ||
ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి ||
శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి ||
విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి ||
అఖువాహనాయ నమః ఊరూ పూజయామి ||
హేరంబాయ నమః కటిం పూజయామి ||
లంబోదరాయ నమః ఉదరం పూజయామి ||
గణనాథాయ నమః హృదయం పూజయామి ||
స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి ||
స్కందాగ్రజాయ నమః స్కంధ పూజయామి ||
పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి ||
గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి ||
విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి ||
శూర్పకర్ణాయ నమః కర్ణ పూజయామి ||
ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి ||
సరేశరాయ నమః శిరః పూజయామి ||
విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ||
ఏక వింశతి పత్రపూజ
(ప్రతి నామమునకు కడపట 'పూజయామి అని అనవలెను)
సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి ||
గణాధిపాయ నమః బృహతీపత్రేణ పూజయామి ||
ఉమాధిపాయ నమః బిల్వపత్రేణ పూజయామి ||
గజాననాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి ||
హరసూనవే నమః దత్తూరపత్రేణ పూజయామి ||
లంబోదరాయ నమః బదరీపత్రేణ పూజయామి ||
గుహాగ్రజాయ నమః అపామార్గపత్రేణ పూజయామి ||
గజకర్ణకాయ నమః తులసీపత్రేణ పూజయామి ||
ఏకదంతాయ నమః చూతపత్రేణ పూజయామి ||
వికటాయ నమః కరవీర పత్రేణ పూజయామి ||
భిన్న దంతాయ నమః విష్నుక్రాంతపత్రేణ పూజయామి ||
వటవే నమః దాడిమీ పత్రేణ పూజయామి ||
సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రేణ పూజయామి ||
ఫాలచంద్రాయ నమః మరువకపత్రేణ పూజయామి ||
హేరంబాయ నమః సింధువారపత్రేణ పూజయామి ||
శూర్పకర్ణాయ నమః జాజీపత్రేణ పూజయామి ||
సురాగ్రజాయ నమః గణకీపత్రేణ పూజయామి ||
ఇభవక్త్రాయ నమః శమీపత్రేణ పూజయామి ||
వినాయకాయ నమః అశ్వత్థపత్రేణ పూజయామి ||
సుర సేవితాయ నమః అర్జునపత్రేణ పూజయామి ||
పిలాయనమః అర్కపత్రేణ పూజయామి ||
శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రైః పూజయామి ||
అష్టోత్తర శతనామావళిః
(ప్రతి నామానికి మొదట 'ఓం అని, చివర 'నమః అని చేర్చవలయును)
గం వినాయకాయ విఘ్నరాజాయ
గణేశ్వరాయ స్కందాగ్రజాయ
అవ్యయాయ దక్షాయ
పూతాయ అధ్యక్షాయ
ద్విజప్రియాయ - 10 అగ్నిగర్భచ్ఛిదే
ఇంద్రశ్రీప్రదాయ వాణీప్రదాయ
అవ్యయాయ సర్వసిద్ధిప్రదాయ
శర్వతనయాయ శర్వరీప్రియాయ
సర్వాత్మకాయ సృష్టికర్తే
దేవాయ అనేకార్చితాయ
శివాయ శుద్ధాయ
బుద్ధిప్రియాయ శాంతాయ
బ్రహ్మచారిణే గజాననాయ
ద్వైమాత్రేయాయ గజస్తుత్యాయ
భక్తవిఘ్నవినాశనాయ ఏకదంతాయ
చతుర్బాహవే చతురాయ
శక్తిసంయుతాయ లంబోదరాయ
శూర్పకర్ణాయ హరయే
బ్రహ్మవిదుత్తమాయ కాలాయ
కామినే సోమసూర్యాగ్నిలోచనాయ
పాశాంకుశధరాయ చండాయ
గుణాతీతాయ నిరంజనాయ
అకల్మషాయ స్వయంసిద్ధాయ
సిద్ధార్చితపదాంబుజాయ బీజపూరఫలాసక్తాయ
వరదాయ శాశ్వతాయ
కృతినే విద్వత్ప్రియాయ
వీత భయాయ గదినే
చక్రిణే ఇక్షుచాపభృతే
శ్రీపతయే స్తుతిహర్షితాయ
కులాద్రిభేత్త్రే జటిలాయ
కలికల్మషనాశనాయ చంద్రచూడామణయే
కాంతాయ పాపహారిణే
సమాహితాయ ఆశ్రితాయ
శ్రీకరాయ సౌమ్యాయ
భక్త వాంఛితదాయకాయ శాంతాయ
కైవల్యసుఖదాయ సచ్చిదానందవిగ్రహాయ
జ్ఞానినే దయాయుతాయ
దాంతాయ బహ్మద్వేషవివర్జితాయ
ప్రమత్తదైత్యభయదాయ విబుధేశ్వరాయ
శ్రీకంఠాయ రమార్చితాయ
విధయే నాగరాజయజ్ఞోపవీతపతే
స్థూలకంఠాయ త్రయీకర్త్రే
సామఘోషప్రియాయ పరస్మై
స్థూలతుండాయ అగ్రణ్యే
ధీరాయ వాగీశాయ
సిద్ధిదాయకాయ దూర్వాబిల్వప్రియాయ
అవ్యక్తమూర్తయే అద్భుతమూర్తిమతే
శైలేంద్రతనయోత్సంగ ఖేలనో
త్సుకమానసాయ
స్వలావణ్యసుధాసారజిత మన్మథవిగ్రహాయ
సమస్తజగదాధారాయ
మాయినే మూషకవాహనాయ
హృష్టాయ తుష్టాయ
ప్రసన్నాత్మనే సర్వసిద్ధి ప్రదాయకాయ
శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీవరసిద్ధివినాయకాయ నమః
అష్టోత్తరశతనామపూజాం సమర్పయామి
శ్లో. దశాంగం గుగ్గులూపేతం సుగంధి సుమనోహరం |
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ ||
శ్రీవరసిద్ధివినాయకాయ నమః ధూపమాఘ్రాపయామి.
శ్లో. సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీప మీశపుత్ర నమోస్తుతే.
శ్రీవరసిద్ధివినాయకాయ నమః దీపం దర్శయామి.
శ్లో. సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
శ్లో. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయ మేవచ |
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక |
శ్రీవరసిద్ధివినాయకాయ నమః మహానైవేద్యం సమర్పయామి.
శ్లో. పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం |
కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః తాంబూలం సమర్పయామి.
శ్లో. సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ |
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక ||
శ్రీవరసిద్ధివినాయకాయ నమః సువర్ణాపుష్పం సమర్పయామి.
శ్లో. ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూరశకలైస్తథా |
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ||
శ్రీవరసిద్ధివినాయకాయ నమః నీరాజనం సమర్పయామి.
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి.
దూర్వాయుగ్మ పూజ
(ప్రతి నామమునకు కడపట 'దూర్వాయుగ్మేన పూజయామి అని చేర్చవలెను)
గణాధిపాయ నమః
ఉమాపుత్రాయ నమః
అఖువాహనాయ నమః
వినాయకాయ నమః
ఈశ పుత్రాయ నమః
సర్వసిద్ధిప్రదాయ నమః
ఏకదంతాయ నమః
ఇభవక్త్రాయ నమః
మూషకవాహనాయ నమః
కుమారగురవే నమః
శ్లో. గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన |
వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక.
ఏకదంతైక వదన తథా మూషకవాహన |
కుమారగురవే తుభ్య మర్పయామి సుమాంజలిమ్ ||
శ్రీవరసిద్ధివినాయకాయ నమః మంత్రపుష్పం సమర్పయామి.
శ్లో. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ |
నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన ||
శ్రీవరసిద్ధివినాయకాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాంత్సమర్పయామి
శ్లో. అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక |
గంధపుషాక్షతై ర్యుక్తం పాత్రస్థం పాపనాశన ||
శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పున రర్ఘ్యం సమర్పయామి.
శ్లో. నమ స్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన |
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాం గతిమ్ ||
శ్లో. వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
(అని వినాయకుని ప్రార్థన చేయవలెను)
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపో హం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తన్మా త్కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక ||
ఉద్వాసనమ్
యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః
తాని ధర్మాణి ప్రథమా న్యాసన్,
తే హ నాకం మహిమాన స్సచంతే
యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః.
(అని చెప్పి దేవుని ఈశాన్య దిశగా కదపవలెను.)
పూజావిధానం సంపూర్ణమ్.
విఘ్నేశ్వరుని మంగళ హారతులు
శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును - ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి
భూసురోత్తమలోకపూజ్యునకును - జయ మంగళం ||
నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు |వేఱువేఱుగదెచ్చి వేడ్కతోబూజింతు పర్వమున
దేవగణపతికినిపుడు జయ మంగళం ||
సుస్థిరము భాద్రపద శుద్ధచవితియందు పొసగ సజ్జనులచే పూజ గొనుచుశశి జూడరాదన్న జేకొంటి నొక వ్రతము
పర్వమున దేవగణపతికి నిపుడు జయ మంగళం||
ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు |కమ్మని నేయియును కడు ముద్దపప్పును
బొజ్జవిరుగగ దినుచు పోరలుకొనుచు - జయ మంగళం||
పువ్వులను నిను గొల్తు పుష్పాల నిను గొల్తు గంధాల నిను గొల్తు కస్తూరిని |ఎప్పుడు నిను గొల్తు ఏకచిత్తమ్మున
సర్వమున దేవగణపతి నిపుడు జయ మంగళం||
ఏకదంతంబును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు |జోకయిన
మూషికము పరగుచెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికి నిపుడు జయ మంగళం||
మంగళము మంగళము మార్తాండతేజునకు మంగళము సర్వజ్ఞవందితునకు |మంగళము ముల్లోక మహితసంచారునకు
మంగళము దేవగణపతికి నిపుడు జయ మంగళం నిత్య శుభ మంగళం||
వినాయకుని దండకము
శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రేభవక్త్రా మహాకాయ కాత్యాయనీనాథసంజాత స్వామీ శివా
సిద్ధివినాయకా నీ పాదపద్మంబులన్ నీదుకంఠంబు నీబొజ్జ నీమోము నీ మౌళి బాలేందుఖండంబు నీనాల్గు హస్తంబులు
న్నీకరాళంబు నీ పెద్దవక్త్రంబు దంతంబు నీ వామహస్తంబు లంబోదరంబున్ సదామూషికాశ్వబు నీ మందహాసంబు నీ
చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి
సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్‌గుంకుమం బక్షతల్ జాజులున్ చంపకంబుల్ తగన్ మల్లెలున్ మొల్లలు న్మంచి
చేమంతులున్ తెల్ల గన్నేరులున్ మంకెనల్ పొన్నలున్ పువ్వులున్మంచి దూర్వంబులం దెచ్చి శాస్త్రోక్తరీతి న్సమర్పించి
పూహించి సాష్టాంగమున్ జేసి వినాయకా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ కుడుముల్ వడపప్పు పానకంబున్
మేల్బంగురం బళ్ళెమందుంచి నైవేద్యమున్ బంచనీరాజనంబున్ నమస్కారము ల్జేసి వినాయక నిన్ను బూజింపకే
యన్యదైవంబులం బ్రార్థన ల్సేయుటల్ కాంచనం బొల్లకే యిన్ము దా గోరుచందంబు గాదే! మహాదేవయో సుందరకార
యో భాగ్య గంభీర యో దేవచూడామణీ లోకరక్షామణి బంధుచింతామణి స్వామి నిన్నెంచ నేనెంత నీ
దాసదాసానుదాసుండ శ్రీ బొంత రాజాన్వయుండ రామాభిధానుండ నన్నెప్పుడు న్నీవు చేపట్టి సుశ్రేయునిం జేసి
శ్రీమంతుగన్ జూచి హృత్పద్మ సింహాసనారూఢతన్ నిల్చి కాపాడుంటే కాదు నిన్ గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు
బంగారమై కంటికిన్ రెప్పవై బుద్దియున్ పాడియున్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గగా జేసి పోషించు మంటిన్ తప్పకన్
గావుమంటిన్ మహాత్మాయివే వందనంబుల్ శ్రీగణేశా నమస్తే నమస్తే నమస్తే
వినాయక వ్రత కథ
సూత మహాముని శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆరోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు గజ (ఏనుగు) రూపంలో వున్న గజాసురుడు అనే రాక్షస రాజు పరమ శివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు ''స్వామీ, మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే వుండాలి అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోర్కె తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే వుండటం మొదలుపెట్టాడు.
ఇదిలా వుంటే, కైలాసం (శివుడి ఇల్లు)లో వున్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్లా వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో వున్నాడని తెలుసుకుంది. కానీ, శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి, చివరికి విష్ణుమూర్తిని ప్రార్ధించి, తన భర్త విషయం చెప్పింది. ''ఓ మహానుభావా, పూర్వం భస్మాసురుని బారినుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్ళు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీ దేవిని ఓదార్చి పంపేశాడు.
అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనది అని నిర్ణయించాడు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి, బ్రహ్మ మొదలైన దేవతలచేత తల కొక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరు గంటలు, సన్నాయి తీసుకుని గజాసురుడు వుండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది, ''మీకు ఏం కావాలో కోరుకోండి. నేను ఇస్తాను అని చెప్పాడు.
అప్పుడు శ్రీహరి ''ఇది శివుడి వాహనం నంది. శివుడిని వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని, తనకు చావు తప్పదని అర్ధం చేసుకున్నాడు. అపుడు తన పొట్టలోపల వున్న శివుడిని ''నా శిరస్సు అందరికీ పూజ్యనీయంగా వుండాలి. నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా, లోపలనుంచి శివుడు బైటకు వచ్చాడు.
హరి శివుడితో ''చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు. ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ, ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు.
వినాయకుడి పుట్టుక
కైలాసంలో వున్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తల స్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు వుంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇది ఇలా వుండగా, శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో వున్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న
శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురువచ్చి పూజించి, కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో వున్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి, తాను తీసుకు వచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి 'గజాననుడు అనే పేరు పెట్టి, పెంచుకోవటం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లి తండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహా వీరుడు.
నెమలి అతని వాహనము.
విఘ్నేశాధిపత్యము
ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి, ''విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే వుండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా వుంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి అధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు. శివుడు వారితో ''మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలూ తిరగటానికి వెళ్లిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ''అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా? మీ పాద సేవకుడిని. నాయందు దయ చూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు. శివుడు ''నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఇది అన్ని తీర్ధాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి మూడు కోట్ల ఏభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు. ఇది చూసి ఆశ్చర్యపోయి, కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర వున్న అన్నను చూసి, నమస్కరించి, తన బలాన్ని తిట్టుకుని ''తండ్రీ, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను. క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్ధించాడు. భాద్రపద శుద్ధ చతుర్ధి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశములవాళ్ళూ
విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటి పళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని, కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి, కొన్ని చేతిలో పట్టుకుని, నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు. తల్లి తండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ, చేతులు మాత్రం భూమిమీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆన్చినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద వున్న చంద్రుడు పగలబడి, ఎగతాళిగా నవ్వాడు. 'రాజదృష్టి సోకితే, రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల వున్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు. పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి ''పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని శపించింది.
ఋషిపత్నులకు నీలాపనిందలు
అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూసి మోహించి, మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజు రోజుకూ బలహీనంగా మారిపోవనారంభించాడు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతీ రూపం తప్ప, మిగిలిన ఋషి పత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో వున్న స్వాహా దేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు. పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషి పత్నులకు ఈ నీలాపనింద కలిగింది. దేవతులు, మునులు, ఋషి పత్నులు
ఈ నీలాపనిందలను గూర్చి పరమేష్టికి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్ని దేవుడి భార్యే ఋషి పత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు. అప్పుడు దేవతలు, మిగిలినవాళ్ళు ''పార్వతీ, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో వున్న వారికి కీడు జరుగుతోంది. కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్ధించారు. వారి ప్రార్ధనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి ''ఏ రోజున వినాయకుని
చూసి చంద్రుడు నవ్వాడో, ఆ ఒక్క రోజు మాత్రము చంద్రుని చూడకూడదు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మ, మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్ధిలో మాత్రం
చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా వున్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది.
శమంతకోపాఖ్యానము
ద్వాపరయుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి, ప్రార్ధించి మాట్లాడుతూండగా ''స్వామీ, సాయం కాలం అయింది. ఈ రోజు వినాయక చతుర్ధి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు. నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీ కృష్ణుడు క్షీర ప్రియుడు కావటంతో ఆ రోజు రాత్రి ఆకాశం వేపు చూడకుండా పశువులశాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుడిని ప్రతిబింబం చూసి ''ఆహా! నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించటం ప్రారంభించాడు. కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరంతో శమంతకమణిని సంపాదించి శ్రీ కృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు. శ్రీ కృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు ''ఇది రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది. దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివితక్కువవాడు ఇవ్వడు అన్నాడు. శ్రీ కృష్ణుడు ఊరుకున్నాడు.
ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపింది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోవుచుండగా, ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి, ఆ మణిని తీసుకుని తాను వుండే కొండ బిలానికి వెళ్ళి, తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతి వార్త విని ''నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీ కృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు తన పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీ కృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి, దానిని తొలగించుకొనేందుకు బంధు మిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడి కళేబరం, సింహపు కాలి జాడలు, భల్లూకం కాలిజాడ కనిపించాయి. వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి, అక్కడ ఉయ్యాలకి కట్టబడి వున్న మణిని తీసుకుని తిరిగి వచ్చుచుండగా, అది చూసి వింతమనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది.
అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి, అరుస్తూ, గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభిచాడు.
శ్రీ కృష్ణుడు అతనిని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణసంహారి అయిన శ్రీరామ చంద్రుడే అని అర్ధం చేసుకుని, నమస్కరించి ''దేవాదిదేవా! ఆర్త జన రక్షకా! నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామ చంద్రుడని అర్ధం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలం అయింది. ప్రాణాలు త్వరలో పోనున్నాయి. జీవితేచ్ఛ నశించింది. నా అపచారములు క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్ధించాడు.
అప్పుడు శ్రీ కృష్ణుడు దయతో జాంబవంతుడి తన చేతితో నిమిరి ''జాంబవంతా! శమంతక మణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవటం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు. నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీ కృష్ణునికి మణితో పాటు, తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో, జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తును పిలిపించి, అందరిని పిలిచి జరిగినదంతా వివరించి, మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు ''అయ్యో, లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు. మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి, తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీ కృష్ణుడు ఒక శుభ ముహూర్తంలో జాంబవతీ, సత్య భామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీ
కృష్ణుడిని స్తుతించి ''మీరు సమర్ధులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు. మాలాటి వారు ఏమి చేయగలరు? అని ప్రార్ధించారు.
అప్పుడు శ్రీ కృష్ణుడు ''భాద్రపద శుద్ధ చతుర్ధిలో ప్రమాదవశాత్తూ చంద్రుని దర్శనమైతే, ఆరోజు గణపతిని పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా వుంటారు అని చెప్పాడు. దాంతో దేవతలు, మునులు సంతోషించి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలగువారు గణపతిని పూజించి, తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా వున్నారని - శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తర్వాత, సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
సర్వే జనా స్సుఖినోభవంతు